ఎవరి లక్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో చెప్పలేము. కొంతమంది కోట్లు పెట్టి వ్యాపారం మొదలు పెడితే వాడికి బూడిద మిగులుతుంది. మరొకడు రూపాయి పెట్టుబడిగా పెడితే కోట్ల రూపాయిలు వాడి ఇంటి గుమ్మం ముందు వచ్చి వెళతాయి. అందుకే ఎవరు ఎంత కష్టపడ్డా, కూసింత లక్ లేనిదే వర్కవుట్ అవ్వదని పెద్దలు చెబుతూ వుంటారు. ఓ వ్యక్తి జీవితాన్ని సోడా వార్చివేసింది అంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా వున్నా, ఇది అక్షరాలా నిజం. అవును, సోడా కొనుగోలు చేసేందుకు షాప్‌కు వెళ్లిన ఓ యువకుడని అదృష్టం వరించింది. ఒకటి రెండు కాదు ఏకంగా కోట్లకు అధిపతిని చేసింది.
దాంతో ఈ వార్త స్థానికంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ అనే యువకుడు.. సుమారు నెల రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్ వెళ్లాడు. మరి వాడికి దాహం వేసిందో ఏమిటో మరి అక్కడ సోడా కొనుగోలు చేసి, స్క్రాచర్ గేమ్‌లో పాల్గొని, ఓ లాటరీ టికెట్‌ను సరదాగా కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలోనే తెలియకుండా నెల రోజులు గడిచిపోయాయి. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా అతడు మర్చిపోయాడు.
ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకుల నుంచి అతడికి ఓ రోజు ఫోనొచ్చింది. నువ్వు కొన్న సోడాకు లాటరీ తగిలింది అని చెప్పారు. సంతోషించిన జోస్ ఫ్లోర్స్.. 600 డాలర్లు (సుమారు రూ.47వేలు) గెలుచుకుని ఉంటానని భావించాడు. అంతేకాకుండా.. గెలిచిన డబ్బులు తెచ్చుకోవడానికి వాళ్లు రమ్మన్న చోటుకి బయల్దేరి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక గానీ జోస్ ఫ్లోర్స్‌కు అసలు విషయం తెలియలేదు. తాను ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7కోట్లు) గెలుచుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు.. దాంతో ఒక్క సరిగా ఎగిరి గంతేశాడు. గెలిచి డబ్బుతో సొంతంగా బిజినెస్‌ను మొదలు పెడతానని ఈ సందర్భంగా అతడు చెప్పుకొచ్చాడు. ఇదే గొప్ప విషయం అనుకుంటే, విన్నింగ్ టికెట్‌ను విక్రయించినందుకు.. సూపర్ మార్కెట్‌కు కూడా 10వేల డాలర్లు కూడా అదనంగా లభించడం కొసమెరుపు.