యూట్యూబ్.. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్. ఇందులోని వీడియోలు మొత్తం చూడటానికి లైఫ్ టైమ్ కూడా సరిపోదు. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన దాదాపు అన్ని రకాల వీడియోలు ఇందులో ఉన్నాయి. యూట్యూబ్ చానెళ్ల తో యూజర్లు అనేక అంశాలు గురించి వివరించే వీడియోలతో పాటు టీవీ, సినిమాలు, న్యూస్ ఇలా అన్ని రకాల ఛానెల్స్ తో యూట్యూబ్ అందరికీ వినోదాన్ని పంచుతోంది.
అయితే, తాజాగా యూట్యూబ్ ఆగిపోయింది. అదేంటి ప్రపంచంలో నే దిగ్గజ వీడియోస్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆగిపోవడమేంటి అని మీకు అనిపించినా.. జరిగింది మాత్రం అదే. గంటల తరబడి యూట్యూబ్ సేవలలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆన్ లైన్ వీడియోలు ప్లే కాలేదు. అలాగే, యూజర్లు తమ వీడియోలను అప్లోడ్ చేయడం లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూట్యూబ్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎందుకంటే, ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ యూట్యూబ్ సహా మరిన్ని వాటి కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిదనే వార్తల నేపథ్యంలో నే ఇలా యూట్యూబ్ ఆగిపోవడంతో.. తమ ఛానల్ పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి ఛానెల్స్ పరిస్థితి ఇలానే.. ఉండటంతో , అది సాంకేతికంగా తలెత్తినదిగా తెలిసింది. దింతో యూట్యూబ్ యూజర్లు సోషల్ మీడియాలో ఈ సమస్యను గురించి ప్రస్తావించారు.
విషయం యూట్యూబ్ సంస్థ ప్రతినిధులకు చేరడంతో తాజాగా యూట్యూబ్ స్పందించింది. సాంకేతికంగా తలెత్తిన సమస్య కారణంగానే యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది అని తెలిపింది. ఒక్క భారత్ లోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, కెనడా వంటి ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ యూట్యూబ్ సేవలు నిలిచి పోయాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని యూట్యూబ్ సంస్థ తెలిపింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే తిరిగి సేవలను పునరుద్ధరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఏ సమస్య లేకుండా యూట్యూబ్ సేవలు అందుబాటులోకి రావడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.