వైసిపి కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల నిరసన

హైదరాబాదు, మార్చి 13: ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ గడువు దగ్గర పడుతున్న వేళ టికెట్‌లు ఖరారు కాని నేతలు వారి మద్దతు దారులతో ఆందోళన చేయడం సహజమే. ఆ సీన్ నేడు వైసిపి కేంద్ర కార్యాలయం వద్ద కనిపించింది.

బాపట్ల అసెంబ్లీ టికెట్ కోన రఘుపతికి పార్టీ ఖరారు చేసిందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన చీరాల గోవర్థన్‌రెడ్డి వర్గీయులు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు.

రావాలి జగన్ – పోవాలి కోన రఘుపతి అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చీరాల గోవర్థన్‌రెడ్డికే టికెట్ ఖరారు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అదుపు చేయడం కోసం సెక్యూరిటీ సిబ్బంది కష్టపడ్డారు.