మరో మారు ఏపి హైకోర్టు అక్షింతలు..!ఎందుకంటే…?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును హైకోర్టు మరో సారి తప్పుబట్టింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై ముస్లిం యువత దాడి ఘటనకు సంబంధించి కేసును ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై గురువారం ధర్మాసనం విచారించింది.

గత ప్రభుత్వ హయాంలో గుంటూరు పాత పోలీస్ స్టేషన్ ‌పై జరిగిన దాడికి సంబంధించి నమోదు అయిన కేసులపై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాయగా ఆగస్టు 12న ఆ లేఖను ఆమోదిస్తూ ప్రభుత్వం జివో 776ను విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు సురేష్ కుమార్, చాణన్యలు ధర్మాసనానికి విన్నవించి ఇలాంటి నేరాలు భవిష్యత్తులో పునరావృత్తం అయ్యేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ జివో తావిస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని వీరు హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జివోలోని భాషపైనా న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. జివోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుబట్టారు.

కమ్యూనిటీకి సంబంధించిన అంశం కాబట్టి అవసరమైతే ఎన్ఐఏతో విచారణ చేయిస్తామని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం కేసుల ఉపసంహరణ జివోపై ఎన్ఐఏని ఇంప్లీడ్ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.