మోదీకి కాంగ్రెస్ అండ!

ఢిల్లీ, జనవరి 4: ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్  గ్రంధాలయ నిర్మాణం కోసం  నిధులు సమకూర్చడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ  అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయెగ్యం కావనీ, భారత్ ఆఫ్ఘనిస్థాన్‌కు అందిస్తున్న సహకారం గురించి మోదీ ప్రభుత్వం అమెరికాకు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడిన తీరు ఏమాత్రం అంగీకారమైంది కాదన్నారు.  ఈ వ్యాఖ్యలపై భారత్ తగిన రీతిలో సమాధానం చెబుతుందని ఆశిస్తున్నట్లు  తెలిపారు.

2004 నుండి భారత్ ఆధ్వర్యంలో ఆఫ్గన్‌లో రోడ్లు, డ్యాంలు నిర్మిస్తున్నాం.  ఆదేశానికి మూడు బిలియన్ అమెరికన్ డాలర్ల మేర సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు అంటూ అహ్మద్ పటేల్  ట్వీట్ చేశారు.

భారత ప్రధానిపై హేళన ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా మాట వినే అవసరం భారత్‌కు లేదన్నారు.  ఆఫ్గానీ సోదర,సోదరీమణులకు అండగా ఉంటామన్నారు.