జ‌గ‌న్‌కు దొరికిపోయిన బాల‌య్య అల్లుడు… హైకోర్టు సాక్షిగా ఏం జ‌రిగిందంటే…

గీతం యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని ప‌లు నిర్మాణాలు అక్ర‌మాలుగా పేర్కొంటూ సంబంధిత అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇది రాజ‌కీయ రంగు పులుముకుంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సొంత అల్లుడు శ్రీ భ‌ర‌త్‌పై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన రాజకీయ దాడిగా ఈ చ‌ర్య‌ను ప‌లువురు పేర్కొంటున్నారు. దీనిపై వైసీపీ సైతం త‌గు రీతిలో కౌంట‌ర్ ఇస్తోంది. అయితే, ఇందులో ఓ ఊహించ‌ని అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.

800 కోట్ల విలువైన‌….

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గీతం యూనివ‌ర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకుని తమ ఆధీనంలో పెట్టుకున్న రూ.800 కోట్ల పైచిలుకు విలువైన, 40 ఎక‌రాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. “ప్రభుత్వ భూముల్ని కాపాడాల‌నే లక్ష్యంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ నాటి నుంచి ఒక పాల‌సీగా ఆక్రమణలను తొలగిస్తున్నాం. విశాఖ‌పట్నం లాంటి మ‌హానగ‌రంలో ప్రభుత్వ భూముల‌ను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏడాదికాలంగా ఆక్రమణదారుల చెరలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై గీతం యాజమాన్యం కోర్టుకు వెళ్ళితే… కోర్టు తాత్కాలికంగా ఒక ఆర్డర్ ను ఇస్తే.. దానిని కూడా వక్రీకరించి టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. “ అని అమ‌ర్‌నాథ్ తెలిపారు.

ఆహా టీడీపీ…

గీతం యాజమాన్యం వేసిన రిట్ పిటీషన్లో.. ఎక్కడా అది తమకు సంబంధించిన భూమి అని గానీ, దానిపై తమకు హక్కు ఉందనిగానీ చెప్పలేదని అమ‌ర్‌నాథ్ వెల్ల‌డించారు. “హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో ఆ సంస్థకు చెందిన బిల్డింగులు, వారి పరిధిలో వారికి హక్కు ఉన్న బిల్డింగులను కూల్చవద్దని చెప్పారు. అంతే తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కట్టినటువంటి కట్టడాలను కూల్చవద్దని ఎక్కడా చెప్పలేదు. 30వ తేదీ వరకు గీతం కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ లు కూల్చవద్దని, గీతం యాజమాన్యం కూడా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని మాత్రమే ఉంది. ప్రభుత్వ చర్యను హైకోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. దీనిని టీడీపీ తమకు ఇష్టం వచ్చినట్లు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. “ అని ఎద్దేవా చేశారు.

గీతం యాజ‌మాన్య‌మే చెప్పిందిగా?

గీతం యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యమే 2020, ఆగ‌ష్టు 3వ తారీఖున ఎండాడ గ్రామంలో వారి ఆధీనంలో ఉన్న 43 ఎక‌రాల ప్రభుత్వ భూమిని ఎలియనేషన్ కోసం గౌర‌వ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. దీని అర్థం ఏమిటి, అది వారి భూమి కాదనే కదా.. ఇంత‌కంటే రుజువు ఏం కావాలి? ప్రభుత్వ భూమిని వారి స్వాధీనంలో పెట్టుకుని, ఎలియనేషన్ లో మీరు ఎంత ఫిక్స్ చేస్తే అంత డ‌బ్బు క‌డ‌తామ‌ని లేఖరాసిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి ఇంత‌కంటే రుజువు ఏం కావాలి? “ అని అమ‌ర్‌నాథ్ ప్ర‌శ్నించారు.

18 వేల‌కే ఇచ్చేశారు…

గీతం విశ్వవిద్యాల‌యం అవ‌స‌రాల కోసం గతంలో ప్రభుత్వాలు 71 ఎక‌రాలు కేవ‌లం రూ.18వేలుకు ఇవ్వడం జ‌రిగిందని అమ‌ర్‌నాథ్ వెల్ల‌డించారు. “ఆ డెబ్భై ఎక‌రాల‌కు ఆనుకుని, వారి సొంత జిరాయితీ పట్టా భూమి 30ఎక‌రాలు ఉన్నప్పటికీ దాన్ని వారి అవ‌స‌రాల కోసం, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార అవసరాల కోసం ఉంచుకుని, ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమించుకుని, కొట్టేయాల‌నే ప్రయత్నం చేస్తున్నారు. 1998లోనే గీతం యాజ‌మాన్యానికి 71 ఎక‌రాలు అవ‌స‌రం లేదు, అందులో 22 ఎక‌రాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయండ‌ని సీసీఎల్ఏ లెట‌ర్ పెడితే…అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 15రోజుల త‌ర్వాత సీసీఎల్ఏ ఇచ్చిన ఆర్డర్ ను మ‌ళ్లీ తిరిగి రీబ్యాక్ చేశారు“ అని గుర్తు చేశారు.

టీడీపీ గ‌గ్గోలు అర్థ‌మేంది?

ఆక్రమ‌ణ‌లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చే‌సుకోవ‌డం క‌క్ష సాధింపు చ‌ర్య అని అంటున్నార‌ని అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. “ ఆక్రమించిన వ్యక్తులతోపాటు స్వయంగా ఈ రాష్ట్రానికి ప్రతిప‌క్ష నాయ‌కుడైన చంద్రబాబు, ఆయ‌న కొడుకు లోకేష్ ద‌గ్గర నుంచి విశాఖ‌లోని కొందరు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, స్కాంలు చేసి అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు వ‌ర‌కు, ఇదేదో రాజ‌కీయ ప‌ర‌మైన‌ చర్యగా అభివర్ణించి, ప్రజ‌ల ముందు వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం క‌క్ష సాధింపు చ‌ర్యలకు పాల్పడుతుంద‌నే క‌ల‌రింగ్ ఇవ్వడానికి ప్రయ‌త్నం చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో అత్యంత ఖ‌రీదైన రుషికొండ ప్రాంతంల్లో ఉన్న కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌లు విలువచేసే ప్రభుత్వానికి చెందిన ఆస్తిని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే దానిని తప్పు అని ఏ మొహం పెట్టుకొని అంటున్నారో సామాన్య ప్రజలకు సైతం అర్థం కావటం లేదు. తప్పులు చేసి కూడా సానుభూతి పొందాలనుకునే దిక్కుమాలిన ఆలోచనలు టీడీపీకి, చంద్రబాబుకు మాత్రమే వస్తాయి. “అని పేర్కొన్నారు.