ఎల్ ఆర్ ఎస్ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

 

(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

అక్రమ లే అవుట్ లు, భూముల క్రమబద్దీ కరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ ఆర్ ఎస్ ఫథకంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ ఆర్ ఎస్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ నిర్వహించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

రెగ్యులరైజేషన్ జివోలోని రూల్ 10,13ని సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రూల్ 10 ద్వారా పెనాల్టీలు వసూళ్లు చేస్తున్నారనీ, పెనాల్టీలు ఉపసంహరించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. అదే విధంగా రూల్ 13 ద్వారా రిజిస్ట్రేషన్ ఆపివేశారనీ, దాన్ని కొట్టివేయలని పిటిషనర్ కోరారు.

పేద మధ్యతరగతి ప్రజలు వారి తప్పులేకుండా భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుందని, సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ లకు జరిమానాలు లేకుండా రెగ్యులరైజ్ చేయాలనిీ కోమటిరెడ్డి కోరుతున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్ లకు కొనుగోలు చేసిన ధరలో దాదాపు సగం మళ్లీ కట్టాలంటే పేద, మధ్య తరగతి వర్గాలకు భారం అవుతుందని కోమటిరెడ్డి పేర్కొంటున్నారు. ఈ ఎల్ ఆర్ ఎస్ స్కీమ్ పై ఇప్పటికే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.