వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్ మిగతా భాషల్లో కంటే తెలుగులో ముందే మొదలు పెట్టేశారు. ముందు అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన ఈ మెగా సీజన్ తర్వాత సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ వారి స్థానిక భాషల్లో తెలుగు వారు ఇచ్చిన ధైర్యంతో పట్టలెక్కించేశారు. అంతా బాగానే ఉంది కానీ ముందు నుండి బిగ్ బాస్ మొదలు కావడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన అక్కినేని నాగార్జున షో కి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
అంతా లాజికల్ గా ఉండడంతో నాగార్జున కొద్దిరోజులు షూటింగ్ లలో నిమగ్నమై తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిరోజులు బిగ్ బాస్ నుండి బ్రేక్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. నాలుగో సీజన్ వీకెండ్స్ లోనే బిగ్ బాస్ షో అత్యధిక రేటింగ్ సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణం నాగార్జున అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రోజు ఎలిమినేషన్ తో హౌస్ లో వాతావరణం వేడెక్కిస్తున్న నాగ్ తర్వాత సన్ డే ఫన్ డే అంటూ అందరినీ ఆడిస్తున్నాడు. ఇలా నాగార్జున ఈ షో కి ఇచ్చే బూస్ట్ అంతా ఇంతా కాదు.
కానీ ఒకానొక సందర్భంలో షూటింగ్ పనుల వల్ల నాగార్జున కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. గత సీజన్లో రమ్యకృష్ణ రెండు ఎపిసోడ్లు అలాగే వచ్చింది. ఆమె కూడా హోస్ట్ గా బాగా ఆకట్టుకుంది. అయితే ఈసారి కూడా మన్మధుడు షో కి కొంచెం బ్రేక్ ఇవ్వక తప్పదట. ముందు అనుకొన్న ప్రకారం నాగార్జున తదుపరి సినిమా వైల్డ్ డాగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మామూలుగా అయితే ఇండియా లోనే ఈ షెడ్యుల్ ముగించాల్సి ఉంది కానీ ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆ టీమ్ కాస్తా థాయిలాండ్ కు వెళ్లాల్సి వస్తోంది.
ఇండియాలో ఉంటే నాగార్జున ఎలాగైనా వీకెండ్ ఎపిసోడ్ అందుబాటులో ఉండే వాడు కానీ థాయిలాండ్ లో దట్టమైన అడవుల్లో 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కనీసం మూడు వారాలు నాగార్జున అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈసారి అతని స్థానంలో ఎవరు వస్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.