ఇన్స్టాగ్రామ్ లైక్స్ లో హాలీవుడ్ భామ కైలీ జెన్నర్ ది తిరుగులేని రికార్డు . ఈ అందాల రాణి తనకు సంబంధించి ఏ ఫోటో పెట్టినా లైక్స్ వెల్లువలా వచ్చిపడతాయి. అంతెందుకు గత ఏడాది కైలీ జెన్నర్ ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురు ఫోటో పెట్టడంతోనే ఆ ఫోటోకు 18 మిలియన్లకు పైగా లైకులు వచ్చి పడ్డాయంటే ఈమెకి ఉన్న ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. అలా ఇన్ స్టాగ్రామ్ ఎక్కువమంది లైక్ చేసిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.
అయితే అంతటి స్టార్ రికార్డు తాజాగా ఓ కోడి గుడ్డు దెబ్బకు బద్దలై పోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది నిజం. ఇన్స్టాగ్రామ్ లో కైలీ జెన్నర్ రికార్డును అంతకు మించిన మరో స్టార్ ఎవరో బ్రేక్ చేయడం కాకుండా ఒక సాధారణ కోడి గుడ్డు బద్దలుగొట్టిందంటే నమ్మశక్యం కావడం లేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకు ఆ హాలివుడ్ పిల్లని తోసిరాజని ఇన్ స్టాగ్రామ్ లో సరి కొత్త రికార్డు రికార్డ్ సృష్టించిన ఆ కోడి గుడ్డు వివరాలు ఇవి. పై చిత్రంలో ముదురు గోధుమ రంగులో ఈ గుడ్డును ‘ఎగ్ గ్యాంగ్’ పేరుతో ఉన్న ఒక ఖాతా నుంచి పోస్ట్ చేశారు. మరి ఈ గుడ్డులో జనాలకు ఏం ప్రత్యేకత కనిపించిందో తెలీదు కానీ దీనికి ఏకంగా 18.2 మిలియన్ల లైకులు వచ్చాయి. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో కైలీ జెన్నర్ కుమార్తె పేరుతో ఉన్న 18 మిలియన్ల లైక్స్ రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. ఇదండీ!…పిల్ల రికార్డు బద్దలు కొట్టిన గుడ్డు కథ.