Train Accident: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 270 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని ఏపీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతి చెందగా, మరి కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రైలు ప్రమాదంలో మృతి చెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

25 మంది ఆచూకీ లభించలేదు
రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ఏపి సర్కార్ అండగా నిలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం కు చెందిన గురుమూర్తి (60) ఈ ప్రమాదంలో మృతి చెందాడన్నారు. ఏపిలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతి చెందాడు. గురుమూర్తి బాలాసోర్ లో నివాసం ఉంటున్నారు. గురుమూర్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిందనీ, అలాగే బాధితులకు కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏపికి చెదిన ప్రయాణీకులు 695 మంది గుర్తించామనీ, 553 మంది సురక్షితంగా ఉన్నారన్నారు. కొరమాండల్ రైలులో 480 మంది, యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో 211 మంది ప్రయాణించారన్నారు. 22 మంది గాయపడ్డారనీ, 90 మంది రైలు ప్రయాణం చేయలేదన్నారు. ఇంకా 25 మంది కాంటాక్ట్ లోకి రాలేదన్నారు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విశాఖ ఆసుపత్రిలో అయిదుగురికి చికిత్స అందిస్తున్నామన్నారు. స్వల్పంగా గాయపడిన 11 మందికి చికిత్స అందించి పంపించారని ఆయన తెలిపారు.
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి