ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ముందస్తు ఎన్నికల ప్రచారాలు మళ్లీ వచ్చాయి. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లబోతున్నారనీ, దానికి ఇదీ కారణాలు అంటూ కూడా విశ్లేషణలు వచ్చాయి. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లబోతున్నారనీ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము రెడీ గా ఉన్నామని నిత్య ప్రకటనలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే తాజాగా ఇవేళ జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తొంది.

సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో సుమారు గంట పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగానే ముందస్తు ఎన్నికల అంశంపైనా జగన్ మాట్లాడారు. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారుట. ముందస్తు ఎన్నికలకు అంటూ జరుగుతున్న ప్రచారం అంతా కూడా రాజకీయమేనని జగన్ అన్నారు. ప్రతిపక్షాల ప్రచారాలను వైసీపీ శ్రేణులు పట్టించుకోవద్దనీ, మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనీ, ఈ తొమ్మిది నెలలు అత్యంత కీలకమని, మరింత సమర్ధవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తొంది.
మరో 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనీ, కష్టపడితే మళ్లీ అధికారం మనదేనని జగన్ అన్నట్లు సమాచారం. మంత్రులు మరింత చొరవతో పని చేయాలనీ, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారుట. ప్రభుత్వం చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెలేయలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలనీ, క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సీఎం జగన్ సూచించారు. ఇదే క్రమంలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, దానిపై మంత్రులు స్పందించవద్దని సూచించారుట. రెండు రోజుల క్రితం సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా సీఎం జగన్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
ఏపి కేబినెట్ ఆమోదించిన కీలక అంశాలు ఇవే..వాళ్లకు గుడ్ న్యూస్