RK Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఓ సామాజిక వర్గం హర్ట్ అయ్యింది. రాజకీయాల్లో ఉన్న నేతలు ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలు చేయడం సహజమే. అయితే ఒక్కో సారి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొందరు వెంటనే స్పందించి సదరు వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించడమో లేక ఆ వ్యాఖ్యల కారణంగా మనోభావాలు దెబ్బతిన వారికి క్షమాపణలు చెప్పడమో లాంటివి చేస్తుంటారు. కొందరైతే నాయకుల విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుని తమ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిన విషయంలో ఏ చిన్న తేడా గమనించినా తీవ్రంగా రియాక్ట్ అవుతుంటారు.

ప్రస్తుత సమాజంలో నేతల మాటలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ న్యాయపోరాటాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా టంగ్ స్లిప్ అయి వివాదంలో ఇరుక్కున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడే ఆర్కే రోజా .. తాజాగా ఓ సామాజిక వర్గం హర్ట్ అయ్యేలా మాట జారారు. దీంతో ఆమె చెసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమ సామాజిక వర్గాన్ని ఎలా కించపరుస్తారంటూ నిలదీస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా తన కృష్ణాజిల్లా పర్యటనలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వారిని విమర్శించే క్రమంలో చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరినీ బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ సంఘం నేత ఎర్ర అబ్బాయితో కలిసి పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇంత వరకూ ఆర్కే రోజా స్పందించలేదు. ఈ వ్యవహారం మరింత ముదరకముందే ఆర్కే రోజా స్పందించి ఆ సామాజికవర్గం మెత్తబడేందుకు స్టేట్ మెంట్ ఇస్తే బాగుంటుందనే మాట వినబడుతోంది.
AP High Court: ఏపీ హైకోర్టులో రామోజీ, శైలజాకిరణ్ లకు ఊరట