PSLV-c55: పీఎస్ఎల్వీ – సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి శనివారం పీఎస్ఎల్వీ – సీ 55 రాకెట్ ను ప్రయోగించారు. సింగపూర్ కు చెందిన 741 కిలోల టెలియోస్ – 2 శాటిలైట్ తో పాటు 16 కేజీల లూమ్ లైట్ – 4 ఉపగ్రహాన్ని ఇస్రో రోదసిలోకి పంపారు. ముందుగా రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట లోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇవేళ మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ – సీ 55 రాకెట్ ను రోదసిలోకి పంపారు. పీఎస్ఎల్వీ – సీ 55 రాకెట్ ప్రయోగం విజయంవతం కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్ లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ మాట్లాడుతూ .. పీఎస్ఎల్వీ – 55 రాకెట్ నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రయోగమని, ఉపగ్రహాలతో పాటు ఏడు పే లోడ్స్ ను కూడా పంపామని వివరించారు. భవిష్యత్తులో కీలక ప్రయోగాలు చేపడతామని, మరిన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని ప్రకటించారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజ్ అందించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చెప్పారు. పీఎస్ఎల్వీ ద్వారా వందలాది ఉపగ్రహాలను ప్రయోగించామనీ, ఈ సారి ప్రయోగించిన రాకెట్ లో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. దీని వల్ల వ్యయం తగ్గిందని, విదేశాల నుండి బాగా డిమాండ్ వస్తొందని తెలిపారు. చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం కులశేఖర పట్నం లో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని వివరించారు.
Video Viral: అభిమానం అంటే ఇది కదా..! అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్