తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం తాడిపత్రిలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తేవడంతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆరోపించారు. ఏ ప్రాంతంలో లేని విధంగా తాడిపత్రిలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిడిళ్లతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడ్డారని జేసీ ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తాను చనిపోయి ఉండాల్సింది కానీ ఆయన చనిపోయాడని అన్నారు జేసీ ప్రభాకరరెడ్డి. తాను ప్రమాణం చేసి చెబుతున్నా వాళ్లు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.

మరో పక్క సీఐ బలవన్మరణంపై జేసీ ప్రభాకరరెడ్డి చేసిన ఆరోపణలకు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. రాజకీయ ఒత్తిడి కారణంగా సీఐ చనిపోయినట్లు నిరూపిస్తూ తాను ఏ చర్యకైనా సిద్ధమని పేర్కొన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే వేరేగా చేయాలని గానీ ఇలా చనిపోయిన వారి విషయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు. ఆయన మాదిరి తాను కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చే వాడిని కాదన్నారు. ఈ విషయంలో తాను ఏ విచారణకైనా సిద్దమని పేర్కొన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.
మరో పక్క సీఐ ఆనందరావు మృతిపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. సిఐ ఆనందరావు భార్య భర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగున్నాయని తెలిపారు. నిన్న రాత్రి ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పని వత్తిడి ఏమిలేదన్నారు. ఎందుకంటే ఆనందరావు దాదాపు సంవరత్సర కాలంగా తాడిపత్రిలో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆనందరావు కుటుంబ సభ్యులతో తాను మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కుటుంబాల కలహాల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మరే ఇతర కారణాలు లేవని స్పష్టం చేశారు. వారి బందువులను కూడా విచారించి పూర్తి సమాచారం తెలియజేస్తామని ఆయన తెలిపారు.
Suicide: తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?