కీలక దశకు వివేకా హత్య కేసు విచారణ..!!

 

(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కీలకదశకు చేరుకున్నది. సీబీఐ అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ కేంద్రంగా చేసుకున్న సీబీఐ అధికారులు మూడు బృందాలుగా జిల్లాలో విచారణను కొనసాగిస్తున్నారు.

పులివెందులకు చెందిన మున్నా మున్నా దంపతులతో పాటు  ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరిని సీబీఐ అధికారులు దర్యాప్తునకు పిలిపించి విచారణ చేస్తున్నారు. నిన్న ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి సెల్ ఫోన్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కర్మాగారంలో ఉద్యోగిగా ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా బ్యాంక్ ఖాతాను సీజ్ చేసిన సీబీఐ అధికారులు లాకర్‌లోని 48లక్షల నగదు, 20 తులాల బంగారం, 28 లక్షల ఎఫ్‌డీలను స్వాధీనం చేసుకున్నారు. భార్య, భర్తల వివాదంలో చెప్పుల వ్యాపారి మున్నాను గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి మందలించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. చెప్పుల షాపు వ్యాపారి మున్నాకు ముగ్గురు భార్యలు ఉండగా మొదటి భార్యను సీబీఐ అధికారులు రెండు రోజుల పాటు విచారించారు.

మూడు నెలల క్రితం మొదటి దశ విచారణ పూర్తి చేసి వెళ్లిన సీబీఐ అధికారులు ఈ నెలలో రెండవ దశ విచారణ చేపట్టారు. సీబీఐ కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో మరి కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు.