వీసాలతో మోసం చేస్తున్న ముఠా సభ్యుల అరెస్టు

హైదరాబాదు, డిసెంబర్ 20  నకిలీ వీసాలతో అమాయకులను మోసం చేసి విదేశాలకు పంపుతున్న ఇద్దరు ముఠా సభ్యులను ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. ఇండిగో ఎయిల్‌లైన్స్లో ఉద్యోగిగా పనిచేస్తూ హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఎండీ ఇబ్రహీం,  ఎయిర్‌ ట్రావెల్స్ నిర్వహిస్తున్న షేక్‌ జుబేర్‌ మరికొంత మందితో కలసి గత కొంత కాలంగా నకిలీ వీసాలను సృష్టిస్తున్నారు. వీసాలను తయారుచేయడమే కాక పీవోఈ (ప్రోటక్టివ్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌)తో నకిలీ వీసా ద్రువీకరణ పత్రాలను సృష్టించి అమాయకులను గల్ఫ్‌ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. గత వారంలో విమానాశ్రయం నుంచి కొంత మందిని తరలిస్తుండగా అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యేసరికి దుండగులు పరారయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు దుండగులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.