జన్ ధన్ తీసుకువచ్చిన మార్పు ఇదే..! మోడీ మార్కు చూపించినట్టేనా..!?

 

 

“జన్ ధన్ యోజన” ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. జీరో బ్యాలెన్స్‌తో అర్హులు అయినా ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు తెరవడంతో, గిన్నిస్ బుక్ లో సైతం స్థానం సంపాదించింది.

 

ఈ జన్ ధన్ యోజన ద్వారా లబ్ధిదారులకు చేరవలసిన ప్రభుత్వ పధకాల నగదు అంత మధ్యవర్తుల చేతుల్లోకి రాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. 51 మంత్రిత్వ శాఖల 351 పథకాలలో అమలు చేసిన మోడీ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) సౌకర్యం ద్వారా 1.70 లక్షల కోట్ల రూపాయలకు పైగా నగదును బోగస్ లబ్ధిదారులకు చేరకుండా ఆదా చేసింది. జన ధన్, ఆధార్-మొబైల్ యొక్క ‘జామ్ ట్రినిటీ’, బోగస్ లబ్ధిదారులను గుర్తించడం మరియు ప్రభుత్వ పథకాలలో లీకేజీలను నివారించడం సులభం చేసింది.

ఆధార్ మరియు మొబైల్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేయడం వల్ల ప్రభుత్వ రేషన్ పంపిణీలో
2.98 కోట్ల బోగస్ లబ్ధిదారులను వ్యవస్థ నుంచి తొలగించబడ్డారు, దీనితో మొత్తం రూ .66,896.87 కోట్లు ఆదా అయ్యాయని ఆహార, ప్రజా పంపిణీ అధికారులు తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం, 51 మంత్రిత్వ శాఖలు 2019 డిసెంబర్ 31 వరకు మొత్తం రూ .1,70,377.11 కోట్లు నకిలీ ఖాతాదారుల చేతుల్లోకి రాకుండా నిరోధించాయి.

డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ప్రణాళిక కింద రూ .12,95,468 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు పంపిణీ చేశారు. 2020-21లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, పిడిఎస్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలలో భాగంగా రూ .2,10,244 కోట్లు మధ్యవర్తుల చేతులలోకి వెళ్లకుండా నేరుగా ఖాతాలకు ప్రభుత్వం అందచేసింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ లో, జాబ్ కార్డులు మరియు కార్మికుల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానించబడినందున, 5.55 లక్షల మంది బోగస్ లబ్ధిదారులు పట్టుబడ్డారు. దీనివల్ల రూ .24,162 కోట్లు దుర్వినియోగం కాకుండా చూసుకున్నారు. అదేవిధంగా డిబిటి పథకం కారణంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాలలో 98.8 లక్షల బోగస్ లబ్ధిదారులు ఉన్నారు అన్ని తెలిసింది. నకిలీ లబ్ధిదారుల తొలగింపుతో 1,523.75 కోట్ల రూపాయల కుంభకోణాన్ని నిరోధించగల్గింది.

కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాన్ని నిశితంగా పరిశీలించిన ఒక అధికారి మీడియా తో మాట్లాడుతూ “జామ్ ట్రినిటీ (జన ధన్-ఆధార్-మొబైల్) మధ్యవర్తుల వెబ్‌ను తొలగించింది అనే విషయాన్ని తెలియ చేసారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అవినీతిని నివారించడానికి ఇది విజయవంతమైన ఉదాహరణ. పిడిఎస్ నుండి ఎరువుల వరకు, నకిలీ కార్మికుల లబ్ధిదారులు, పెట్రోలియం మంత్రిత్వ శాఖతో అనుసంధానించబడిన అన్ని పథకాలలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కాకుండా కాపాడుకోగలిగాం అన్ని అయినా తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ఎల్‌పిజి సబ్సిడీ, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, వృద్ధాప్య పెన్షన్, స్కాలర్‌షిప్‌ల వంటి సామాజిక సహాయ పథకాలలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంది. దీనికోసం 38 కోట్లకు పైగా జన ధన్ ఖాతాలు, 100 కోట్ల ఆధార్, 100 కోట్ల మొబైల్స్ ఉపయోగపడ్డాయి.