దొంగ డబ్బు దోచేశారు

నోయిడాలో సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన వారిపై కాల్పులు జరిపి 40 లక్షల రూపాయలు దోచేశారు. కానీ దోచుకున్నామన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ లోపు సందట్లో సడామియా అన్నట్లు దొంగలు దోచిన డబ్బులో కొంత జనం దోచుకున్నారు. ఈ కథనాన్ని హిందూ స్థాన్ టైమ్స్ ప్రచురించింది.

సరిగ్గా సమయం మధ్యాహ్నం 1.45 .. నోయిడాలోని సెక్టార్ 82 కేంద్రీయ విహార్ 2 సొసైటీలోని ఎస్‌‌‌‌‌‌బిఐ ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వాహనం వచ్చింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు మొహం కనపడకుండా రుమాలు ధరించి అక్కడికి చేరుకున్నారు. డబ్బుకి కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చిన్నపాటి ఎన్‌కౌంటర్ని తలపించిన ఈ ఘటన నుంచి గార్డులు తేరుకునేలోపే ఆ దుండగులు రూ.40 లక్షలు విలువ చేసే సంచిని కొట్టేశారు. తప్పించుకునే ప్రయత్నంలో తమ మోటార్ సైకిల్‌పై రద్దీగా ఉండే సెక్టార్ 110 మార్కెట్ వైపు దూసుకెళ్లారు. కానీ ఆ ప్రాంతంలో ఓ జంక్షన్  చేరుకోగానే వారి మోటార్ సైకిల్‌ని వెనకనుంచి వ్యాగన్ ఆర్ కారు ఢీకొంది.

ఈ హఠాత్తు పరిణామంతో వారిద్దరూ కింద పడ్డారు. డబ్బు కట్టలు కూడా సంచి నుంచి బయట పడిపోయాయి. డబ్బు ఎవరికి చేదు. అలా రోడ్డుపై పడిపోయిన డబ్బు కట్టల కోసం జనం ఎగపడ్డారు. అందిన మేర దోచేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా దుండగులు షాక్ తిన్నారు. అందులో ఒకడు హుటాహుటిన బైక్‌ని అక్కడే వదిలేసి పరుగు తీసాడు. మరొకడు పోలీసులకు పట్టుబడ్డాడు.

సుమారు రూ 20,35,000 సంచి నుంచి బయటపడ్డాయి. అందులో కొంత మేర డబ్బు కట్టలు డ్రైన్ లో పడిపోయాయి. పోలీసులు పట్టుబడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ 19,65,000 స్వాధీనం చేసుకున్నారు. మరొకరి కోసం గాలింపు జరుపుతున్నారు. ‘నేను దుండగలు బైక్‌పై నుంచి పడిపోయిన 5 నిముషాలకి అక్కడికి వెళ్ళాను. అప్పటికే కొంత మంది పిల్లలు 500 నోట్లు కట్టలు పట్టుకెళ్ళటం గుర్తించాను. డబ్బు తీసుకువెళుతున్న ఓ విదార్థిని పట్టుకుంటే ఆతని దగ్గర 75 వేలు దొరికాయి. కొ్న్ని డబ్బు కట్టలు డ్రైన్‌లో పడిపోయాయి’ అని కేంద్రీయ విహార్ సెక్యూరిటీ గార్డ్ ఒకరు వివరించారు.

ఈ ఘటనపై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘ దుండగుల్లో ఒకరు పట్టుబడ్డారు. అతని వద్ద రూ 19,65,000 స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన డబ్బు కోసం దర్యాప్తు చేస్తున్నాం. పారిపోయిన మరో దుండగుడి వద్ద డబ్బు లేదు. వీరిపై సెక్షన్ 394 కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ఎస్ పి సుధా సింగ్ మాట్లాడుతూ..’ ఇప్పటికిప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉందో కనిపెట్టటం కష్టం. దర్యాప్తు కొనసాగుతుంది’ అని వ్యాఖ్యానించారు.