మూడోసారి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్లు విసరడంతో రైలు కిటికీ అద్ధం ఒకటి పగిలిపోయిందని ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు.

అయితే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసరడం రెండు నెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గత డిసెంబర్ 20న ఢిల్లీ-ఆగ్రా మధ్య ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనూ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు.

ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఫిబ్రవరి 17 నుంచి రైలు కమర్షియల్ రన్ ప్రారంభమైంది. ఈ రైలుకు రెండు వారాల దాకా టికెట్లు బుక్ అయినట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.