శత్రుఘ్న సిన్హా ఇంకెంత మాత్రం వీఐపీ కారు!

బీజేపీ రెబల్ ఎంపి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు వీఐపీ సౌకర్యాలను పాట్నా విమానాశ్రయ అధికారులు తొలగించారు. ఆయన ఇంకెంత మాత్రం వీఐపీ కారని పేర్కొన్నారు.

శత్రుఘ్న సిన్హా ఎలాంటి చెకింగ్‌ లేకుండా నేరుగా తన కారులో రన్‌వే వరకూ వెళ్లే అవకాశం  ఉండేది.  అయితే ఆయనకు  కల్పించిన సౌకర్యాల గడువు గత జూన్‌ నెలలో ముగిసింది. కానీ ఆ గడువును పొడగిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదు. దీంతో ఆయనకు ఇక పాట్నా ఎయిర్ పోర్టులో ఎటువంటి అదనపు సౌకర్యాలూ ఉండవని విమానాశ్రయ అధికారులు ఈ రోజు స్పష్టం చేశారు. శత్రుఘ్న సిన్హా కూడా సాధారణ ప్రయాణీకుడిలాగా  సెక్యూరిటీ చెకింగ్‌లను ఎదుర్కొనవలసి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా శత్రుఘ్నసిన్హా ప్రధాని మోడీ విధానాలపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ…బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు విమానాశ్రయంలో ప్రత్యేక సదుపాయాల కల్పన గడువు ముగియగానే వాటిని పొడిగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.