హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న అభియోగంపై గత నెల 14న సైబర్ క్రైమ్ పోలీసులు మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ రూమ్ (కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం)పై దాడి చేసి సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు హార్డ్ డిస్క్ లు స్వాధనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడుగా సునీల్ కనుగోలును పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సునీల్ కనుగోలును విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు .. ఇటీవల మల్లు రవికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 వ తేదీ విచారణకు రావాలని ఆదేశించారు. సునీల్ కనుగోలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మల్లు రవి పై కేసు నమోదు చేశారు. మల్లు రవిని ఏ 5 నిందితుడుగా చేర్చారు.

సునీల్ కనుగోలుకు నోటీసులు జారీ చేసిన సమయంలోనే ఆయనకు ఎలా నోటీసులు జారీ చేస్తారని మల్లు రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ వార్ రూమ్ తన ఆధీనంలో నడుస్తున్నందున ఇస్తే నోటీసులు తనకు ఇవ్వాలి కానీ ఆయనకు ఏమిటి సంబంధం అని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న సునీల్ కనుగోలు తొలుత ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 3న విచారణ జరిపిన హైకోర్టు సునీల్ పిటిషన్ ను కొట్టేసింది. అయితే అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆ క్రమంలో సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హజరు కాగా రెండు గంటల పాటు విచారణ జరిపారు. మరల విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. కాగా మల్లు రవి రేపు విచారణకు హజరు కావాల్సి ఉండగా, ఇవేళ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హజరైయ్యారు. అయితే నిర్దేశించిన తేదీలోనే రావాలని ఆయనను పోలీసులు వెనక్కు పంపించారు.
ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా