(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే పదవి నుంచి తప్పుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలని తీర్పు ఇచ్చిన 2016 జూన్ నాటి బ్రెక్సిట్ రిఫరెండం తర్వాత థెరిసా మే ప్రధాని పదవి చేపట్టరు. చివరికి ఆ బ్రెక్సిట్ కారణంగానే పదవిని కోల్పోతున్నారు.
శుక్రవారం తన అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు ఆపుకునేందుకు మే విశ్వప్రయత్నం చేశారు. బ్రెక్సిట్ను సక్సెస్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించా. అయితే పార్లమెంటు సభ్యులను ఒప్పించలేకపోయాను అని ఆమె ఆన్నారు. రాజీ అనేది అంత పనికిరాని పదమేమీ కాదు అన్నారామె.
యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లేందుకు సంబంధించి థెరిసా మే రూపొందించిన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ మూడు సార్లు తిరస్కరించింది. జూన్ ఏడవ తేదీన తాను రాజీనామా సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు కొత్త నేతను ఎన్నుకుంటారు.