టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అనారోగ్యంతో కన్నుమూత

 

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నర్సింహయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.  నేటి ఉదయం  తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే సమయానికే ఆయన మృతి చెందారు.

నోముల నర్సింహయ్య 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నుండి 2009 వరకూ అసెంబ్లీలో సీపీఎం పార్టీ ప్లోర్ లీడర్‌గా ఉన్నారు.  2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత సీపీఎం పార్టీకి దూరం  అయ్యారు. తరువాత కేసిఆర్ ఆహ్వానం మేరకు 2014 ఏప్రిల్ 8న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ఆ తరువాత 2018లో అదే నియోజకవర్గం నుండి జానారెడ్డిపై నర్సింహయ్య  ఘన విజయం సాధించారు.  నోముల నర్సింహయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. నర్సింహయ్య మృతి పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు కేటిఆర్, నిరంజన్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితర నేతలు, వివిధ పార్టీల నాయకులు నర్శింహయ్య మృతికి సంతాపం తెలిపారు.

1956 జనవరి 9వ తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్లు మండలం పాలెం గ్రామంలో జన్మించిన నోముల నర్సింహయ్య ఉస్మానియా యూనియవర్శిటీ నుండి ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో ఎస్ఏఫ్ఐ నేతగా రాణించారు. ఆ తరువాత నల్లగొండ జిల్లా నకిరేకల్లు కోర్టులో న్యాయవాద వృతి చేపట్టి పేరు సంపాదించారు.