ఇటు శ్వేత పత్రాలు-అటు కూటమి యత్నాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు రాష్ట్ర సమస్యలు, అటు జాతీయ స్థాయి కూటమి యత్నాలలో బిజీబిజీ అయిపోయారు. అదే సమయంలో వచ్చే ఏడాది ఎన్నికలలో రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు పార్టీ వ్యవహారాలపైనా దృష్టి పెట్టక తప్పని సరిపరిస్థితులు ఆయన వచ్చాయి. అన్నిటినీ ఒకే మంత్రంతో సాధించే ఎత్తుగడను ఆయన ఎంచుకున్నారు. అదే రాష్ట్ర పరిస్థితులపై రోజు కో అంశంపై శ్వేత పత్రాల విడుదల. దీని వల్ల రాష్ట్రంలో తన హయాంలో ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరిస్తూనే…అంకెల సాక్షిగా కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచవచ్చు.

అదే సమయంలో శ్వేత పత్రాల ద్వారా కేంద్రంపై విమర్శల దాడి చేస్తూ జాతీయ స్థాయిలో పార్టీలను బీజేపీయేతర కూటమి వైపు ఆకర్షితులయ్యేలా చేయడం. అయితే ఈ మూడు విషయాలలోనూ ఆయన ఇప్పటి వరకూ విడుదల చేసిన శ్వేతపత్రాల వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరేదిశగా పరిస్థితులు మారుతున్నాయా? అంటే ఔనని కానీ, కాదని కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే…బీజేపీ నాయకులే కాకుండా రాష్ట్రంలోని విపక్షాలు కూడా శ్వేతపత్రాలలో పేర్కొన్న గణాంకాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. పాక్షిక సత్యాలతో చంద్రబాబు మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇక జనబాహుల్యం కూడా శ్వేత పత్రాల విడుదల సందర్భంగా ఆయన ప్రసంగాలు స్వోత్కర్ష, పరనిందలాగే ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముప్పేటలా ఆయనపై విమర్శల దాడి కొనసాగుతున్నప్పటికీ…ఆయనకు అండగా జనం నిలుస్తున్నారన్న భావన కలగడానికి విభజన అనంతరం ఏపీకి బీజేపీ మహా అన్యాయం చేసిందన్న భావన జనంలో నెలకొని ఉండటమే. అదే సమయంలో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి విషయంలో ఆయన జోరు కొనసాగుతుండటమే. మోడీ పెద్ద నోట్ల రద్దు సమయంలో జనం భవిష్యత్ లో మేలు జరుగుతుందన్న భావనతో కష్టాలు భరించడానికి సిద్ధపడినట్లుగానే ఏపీలో జనం అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయితే ఒనగూరే ప్రయోజనాల కోసం ఇప్పటి ఇబ్బందులను భరించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని భావిస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా శ్వేత పత్రాల విడుదల, మోడీ గోబ్యాక్ పిలుపు వంటివి రాష్ట్రంలో బీజేపీ శ్రేణులనే కాకుండా కేంద్రంలో మోడీ సర్కార్ ను కూడా ఇరుకున పెట్టాయనడానికి మోడీ పర్యటన అనివార్య కారణాలను ఉటంకిస్తూ వాయిదా పడటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

SHARE