మరో పెళ్లి కోసం.. ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య నల్లగా ఉందంటూ వంక..!

 

(గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత నీవు నల్లగా ఉన్నావు, విడాకులు ఇవ్వాలి అని భర్తతో పాటు అత్తింటి వారు వేధిస్తుంటే ఆ గృహిణి తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. ఇంతటి మనోవేదనను అనుభవిస్తూ తన బాధను చెప్పుకోవడానికి గుంటూరు అర్బన్ ఎస్‌పిని కలిసి విషయం మొత్తం చెప్పింది.

వివరాల్లోకి వెళితే…గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామానికి చెందిన యువతికి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో 2015లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కాపురం కొంత కాలం సాఫీగా సాగింది. అయితే కొన్ని నెలల నుండి భర్తతో అట్టింటి వారు ఆమెను విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. వారి వేధింపులకు తాళ లేక ఆమె ఒక సారి ఆత్మహత్యాయత్నంకు కూడా పాల్పడింది. విడాకులు ఇవ్వకపోతే చంపేస్తామని అర్ధరాత్రి సమయంలో కిరోసిన్ పోసి హత్యాయత్నంకు పాల్పడటంతో పసి పిల్లల్ని తీసుకుని కేకలు వేసుకుంటూ రోడ్డు పైకి పరుగులు పెట్టింది. నేరుగా సోమవారం అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డిని కలిసి భర్త, అత్తింటి వారు పెడుతున్న వేధింపులను కన్నీళ్ళ పర్యంతమవుతూ వివరించింది. ఆమె బాధను విన్నఎస్పి వెంటనే స్పందించారు. భాధితురాలి వద్ద నుండి ఫిర్యాదు స్వీకరించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు అర్బన్ ఎస్పి అమ్మిరెడ్డి.