హింసాత్మకంగా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు – ఘర్షణల్లో 12మంది మృతి

ఢాకా, డిసెంబర్ 30: పలు చోట్ల ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో అధికార పార్టీ ఆవామీ లీగ్‌ యువజన విభాగం సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్‌తో సహా 12మంది మృతి చెందారు. ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. రంగామతిలోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీఎస్‌పీ నిరసనకారులతో జరిగిన ఘర్షణలో మహ్మద్ బషీరుద్దీన్ మృతి చెందాడు. అల్లరిమూకల దాడుల్లో ఒక పోలీసు అధికారి మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నౌఖాలీ ప్రాంతంలోని పోలింగ్ బూత్‌లో దుండగులు ఓటింగ్ యంత్రాలను ఎత్తుకుపోవడంతో పోలింగ్ నిలిపేవేశారు. బక్షాలీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు మృతి చెందారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్ల వల్ల కొన్ని కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది.