ద‌మ్ము ఉంటే ప్ర‌త్యేక హోదా సాధించాలి

అమరావతి, జ‌న‌వ‌రి3: ఆంధ్రప్రదేశ్‌కు నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని ఏపీ బిజేపి నేతలు సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రా మోదీని కాపాడేందుకు ఢీల్లీ మోదీ సీబీఐని బిజేపి బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌గా మార్చేశారని ఆయన ట్వీట్ చేశారు.  ప్రజాధనాన్ని నిలువునా దోచుకున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌కు కేసుల నుంచి విముక్తి కల్పించి, ఏపీని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందన్నారు.  బీజేపీ భారతీయ జోకర్స్‌ పార్టీగా మారిందని విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయని శుక్రవారం ట్వీట్ చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అని, ఇందులో  బీజేపీ భిక్ష ఏమీ లేదన్నారు.  ఉపాధి హామీలో ఎక్కువ నిధులు కేటాయించామని అర్థంలేని చర్చలు చేస్తున్న ఏపీ బీజేపీ  నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉపాధి హామీ పథకంలో ఎందుకు వెనుకబడి ఉన్నాయో చెప్పగలరా అని ప్రశ్నించారు.