ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మూహూర్తం ఖారారు అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుండి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం పది గంటల నుండి ఉభయ సభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలను ఉద్దేశించి పది గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇదే చివరి పూర్తి స్తాయి బడ్జెట్ కాబోతున్నది. వచ్చే ఏడాది ఎన్నికల సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. దీంతో ఈ సారి ఎన్నికల బడ్జెట్ గా దీన్ని భావించవచ్చు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం కొత్త పథకాలను, ఉన్న పథకాల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా ఈ సారి బడ్జెట్ సమావేశాల్ల కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలి సారి ప్రసంగించబోతున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ గా నియమితులైన తర్వాత ఇదే అసెంబ్లీలో తొలి ప్రసంగం కానున్నది.
కాగా ఆ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పది రోజుల పాటు సభ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పది రోజుల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును కూడా ఈ సారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే సుప్రీం కోర్టులో అమరావతి కేసుల విచారణ సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి అందుకు అనుగుణంగా ముందుకు సాగే అవకాశం ఉంది.
తాజాగా విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోనూ సీఎం జగన్ విశాఖ పరిపాలనా రాజధాని గా కాబోతున్నదనీ, తాను త్వరలో షిప్ట్ అవుతానని తెలిపారు. సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావంతోనే ప్రభుత్వం, వైసీపీ పెద్దలు విశాఖ పరిపాలనా రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు, పరిపాలనా భవనాలు, ముఖ్యమంత్రి నివాస గృహం ఏర్పాట్లు అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కేబినెట్ భేటీ అయి ఆమోదం తెలుపనున్నారు.
AP CM YS Jagan: ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు