కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు పాటిల్ నీరజా రెడ్డి ఇవేళ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నీరజా రెడ్డి ఆదివారం కర్నూలుకు వెళుతుండగా, బీచుపల్లి వద్ద కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నీరజా రెడ్డి 2009 నుండి 2014 వరకూ ఆలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. అంతకు ముందు పత్తికొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేరడంతో 2009లో ఆలూరు లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచి పీఆర్పీ అభ్యర్ధిపై 5వేల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఇమడలేక బీజేపీలో చేరారు.
ప్రస్తుతం బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా నీరజారెడ్డి ఉన్నారు. నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పని చేశారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన హత్యకు గురయ్యారు. భర్త మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కాగా నీరజా రెడ్డి మృతి పట్ల ఏపీ బీజేపీ సంతాపం తెలియజేసింది. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి తదితరులు నీరజా రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Delhi Liquor Scam Case: సీబీఐ విచారణకు హజరైన కేజ్రీవాల్ .. కేంద్రంపై కీలక కేజ్రీవాల్ వ్యాఖ్యలు
