Road Accident: అన్నమయ్య – చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజాములో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పలువురు భక్తులు తుఫాను వాహనంలో తిరువన్నామలై గిరి ప్రదక్షిణకు వెళుతుండగా, మార్గం మధ్యలోని అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణానికి సమీపంలోని చిత్తూరు మార్గంలో గల ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొంది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి, శివమ్మ, విమల మరొకరు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నెల పౌర్ణమికి భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ నిమిత్తం తిరువన్నామలైకి వెళుతుంటారు.