Media: జర్నలిజంలో వొనామాలు తెలియని వాళ్లు కూడా నేడు జర్నలిస్ట్ లు గా చలామణి అవుతున్నారు. వీరి వల్ల మీడియా వ్యవస్థకే తీరని కలంకం ఏర్పడుతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు రావడం, వాటిలో పని చేసే సిబ్బంది (కొందరి)కి సరైన అర్హత, శిక్షణ లేకపోవడంతో వారు విధి నిర్వహణలో చేసే చర్యలు జుగుస్పాకరంగా ఉంటున్నాయి. ప్రజలు అస్యహించుకునేలా కొందరు మీడియా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఏదో యూట్యూబ్ ఛానళ్లలో పని చేస్తున్న వారు అలా చేశారు అంటే వాళ్లకు అనుభవం లేదు కాబట్టి ఏదో అలా చేసి ఉండవచ్చని అనుకుంటారు. కానీ ప్రముఖ టీవీ ఛానల్స్ లో పని చేస్తున్న విలేఖరులుసైతం అలానే వ్యవహరిస్తూ ఉండటం విచారకరం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలన్న ధ్యాసను కూడా మరిచి వాళ్ల బాధతో విలవిలలాడిపోతుంటే అదేమి పట్టనట్లు వాళ్ల ముందు లోగో (గొట్టాలు) పెట్టి ప్రమాదం ఎలా జరిగింది..? మీ పేరు ఏమిటి..? డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? మీది ఏ ఊరు..? ఎటు నుండి ఎటు వెళుతున్నారు..? అంటూ ఇలా ప్రశ్నలతోనే వాళ్లను చంపేస్తుంటారు. ఇటువంటివి గతంలో మనం చూశాం.

ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండటంతో వాటిలో పని చేసే జర్నలిస్ట్ లు కూడా ఆయా యాజమాన్యం పార్టీ వైఖరికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు. ఎవరైనా రాజకీయ నాయకుడితో మీడియా ప్రతినిధి మాట్లాడాలి అనుకున్నప్పుడు ముందుగా ఆయన అనుమతి తీసుకుని అతని ముందు లోగో పెట్టి ప్రశ్నలు అడిగితే ఒక అర్ధం ఉంటుంది. కానీ కొందరు మీడియా ప్రతినిధులు అవి ఏమీ పట్టించుకోకుండా నేరుగా ఇళ్లల్లోకి వెళ్లి, ఆ నాయకుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అనేది తెలుసుకోకుండా నేరుగా లోగో పెట్టి ప్రశ్నలు సంధించడం చూస్తే ఎవరికైనా సదరు మీడియా ప్రతినిధిపై ఏహ్యాభావం వ్యక్తం అవుతుంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన విలేఖరి .. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వద్ద ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆ ఎమ్మెల్యే తనకు ఆరోగ్యం బాగోలేదని చేతులు జోడించి వేడుకుంటున్నా వినకుండా ఆ మీడియా ప్రతినిధి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండటంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి.
విషయంలోకి వెళితే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్ వ్యవహారం అనంతరం ఉదయగిరిలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అనుచర వర్గం, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్దం, సవాళ్లు, ప్రతి సవాళ్ల వార్ నడుస్తొంది. ఎమ్మెల్యే పార్టీ అధిష్టానాన్ని విమర్శిస్తే, స్థానిక నాయకులు ఆయనను విమర్శిస్తున్నారు. ఉదయగిరికి వస్తే చంద్రశేఖరరెడ్డి తరిమేస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరించడంతో ఆయన దానిపై స్పందించారు. నిన్న సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్దకు ఆయన అనుచరులతో వచ్చి అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తనను తరిమేస్తామన్న వాళ్లు ఎవరో రావాలంటూ సవాల్ చేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్దమంటూ వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. చంద్రశేఖర్ రెడ్డి సవాల్ కు స్పందించిన వైసీపీ నేతలు శుక్రవారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చేరుకుని చంద్రశేఖర్ రెడ్డి రావాలంటూ సవాల్ విసిరారు. ముందుగా చంద్రశేఖర్ రెడ్డి కూడా సవాల్ స్వీకరించడంతో ఉదయగిరిలో ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
అయితే ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి ఇప్పటికే రెండు సార్లు హార్ట్ స్టోక్ వచ్చింది. శస్త్ర చికిత్సల అనంతరం కోలుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగోలేకపోకపోవడంతో ఉదయగిరికి వెళ్లకుండా మర్రిపాడులోని తన ఇంట్లోనే ఉండిపోయారు. ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ వార్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఓ ప్రముఖ ఛానల్ విలేఖరి నేరుగా ఎమ్మెల్యే నివాసంలోకి వెళ్లిపోయి ఆయన అనుమతి కూడా తీసుకోకుండ మొహంపై లోగో పెట్టి బహిరంగ చర్చకు వెళతారా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు చర్చకు వెళ్లే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించగా, నేను ఎక్కడికి వెళ్లను, నాకు హెల్త్ బాగోలేదు, నేను ఆసుపత్రికి వెళ్లాలి, నన్ను వదలివేయండి అంటూ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నా సదరు మీడియా విలేఖరి ఆయన బాధను ఏమీ పట్టించుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. దీంతో ఆ మీడియా విలేఖరిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీడియా ప్రతినిధి వదిలిపెట్టకుండా మాట్లాడుతుండటంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని లోపలి గదిలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెన్సేషన్స్ కోసమో, బ్రేకింగ్ కోసమో ఇలా వ్యవహరించడం మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరో సారి గుండె నొప్పితో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి