ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అభియోగంపై నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లు వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైయ్యారు. అయితే వీరి రాజకీయ భవిష్యత్తు ఏమిటి.. వీరు ఏ పార్టీలో చేరతారు.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనే విషయాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ తన వర్గీయులతో ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

ఉండవల్లి శ్రీదేవి మాత్రం ప్రస్తుతం తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన పొలిటికల్ స్టాండ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత నేరుగా బెంగళూరు వెళ్లిపోయిన చంద్రశేఖర్ రెడ్డి.. తన నియోజకవర్గానికి చేరుకున్నారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేనని ముందే చెప్పడంతో బాధపడ్డాననీ, అయితే తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని తెలిపారు. తాను పార్టీ నుండి బయటకు వెళ్లలేదనీ, వాళ్లే పంపించారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమార్తెకు అవకాశం కల్పించాలని కోరగా పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదన్నారు. ఏదో ఒకగ సాకు చెప్పి తనను సస్పెండ్ చేశారని అన్నారు. ఈ వేళ ఆయన ముఖ్య కార్యకర్తలతో భేటీ అవ్వనున్నట్లు తెలుస్తొంది.
స్వతంత్ర అభ్యర్ధిగానే..
తాను జనంలోనే ఉంటాననీ, జనం తనతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల్లో తమ కుటుంబానికి మంచి పేరు ఉందని గుర్తు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్టు చేసే వాళ్లందరూ వెధవలేనని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తనను ఏ టీడీపీ నేతలు పిలవలేదనీ, మాట్లాడలేదని తెలిపారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగానే కొనసాగుతానని పేర్కొన్న చంద్రశేఖర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్ధిగానే పోటీ చేస్తానని ప్రకటించారు.
రాజధాని అమరావతిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ