Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతలతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్జాతో భేటీ అయ్యారు. ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జేపి నడ్డాతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటన చాలా రోజులుగా అనుకుంటున్నదేనని చెప్పారు. ఏపికి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలని తాము తొలి రోజు నుండి కోరుకుంటున్నామన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మా అజెండా ఉందనీ, బీజేపీ అజెండా కూడా అదేనన్నారు. వైసీపీ నుండి ఏపిని విముక్తి చేయాలనే అంశంపై అన్ని కోణాల్లో చర్చించామని చెప్పారు.

గత రెండు రోజులుగా జరిపిన చర్చలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. వైసీపీ పాలన నుండి ప్రజలకు విముక్తి చేసేలా ప్రణాళిక ఉంటుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే తమ పార్టీ అభిమతం అని పేర్కొన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశంపైనే వెళుతుందనీ, సరైన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. మమ్మిల్ని మీము బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. అదే విధంగా బీజేపీ కూడా సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
ఏపిలో రాజ్యాంగ విరుద్ద పాలన, అవినీతి, ఘర్షణలపై జేపీ నడ్జాతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అది ఎలా వెళితే బాగుంటుంది అన్నదానిపైనే అన్ని కోణాల నుండి చూస్తున్నామన్నారు. బీజేపీ నుండి ఎంత వరకూ స్పష్టత వచ్చింది అన్న మీడియా ప్రశ్నకు పవన్ సమాధానం దాట వేశారు. సమయం వచ్చినప్పుడు చెబుతామన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.