Weather Updates: ఏపిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రభావం రోజురోజుకు అధికంగా ఉంటోంది. భానుడి ప్రతాపం ఒక వైపు, మరో పక్క వైపు వడగాల్పులతో ప్రజలు అల్లలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వత రోడ్డుపైకి జనాలు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. దీంతో మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానిష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రతపై ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగు సూచనలు అందిస్తొంది. నిత్యం ఏయే ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందో ముందుగానే ప్రజలకు తెలియజేస్తొంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కనవరం, వైఎస్ఆర్ జిల్లా కమలాపురం, వీరపునాయుడిపల్లె, ఎర్రగుంట్ల, ఏలూరు జిల్లా కుక్కనూరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఆయన తెలిపారు. మరో 226 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 – 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.