గెలుపు కోసం ఏదైనా మాట్లాడేస్తాడా బండి సంజయ్..? గ్రేటర్ ఎన్నికలు ఇండియా vs పాకిస్తాన్ ఆట

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పోరు విపరీతంగా రాజుకుంటోంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గడం లేదు. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వీరలెవల్లో విమర్శలు చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిత్ర పక్షం అని కూడా చూడకుండా టిఆర్ఎస్ నాయకుల పై ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఎన్నో మాటలు హద్దులు దాటాయి. ఎన్నో అస్త్రాలని ప్రత్యర్థులపై కి వదులుతున్నారు.

 

ఇదే క్రమంలో బండి సంజయ్ తన దూకుడుని ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రత్యర్థులతో సై అంటే సై అని జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీపడుతూనే ఉన్నారు. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం రూపు మారుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేయర్ పదవి వచ్చాక గతంలో పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఇక ఇప్పుడు ఆయన గ్రేటర్ ఎన్నికలను ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చారు. ఈ మ్యాచ్ లో పాకిస్తానా లేక ఇండియా గెలవాలా అని అడిగాడు. ఇండియా ఓడిపోతే నల్లజెండాలతో నిరసన తెలిపిన వాళ్లని ఏం చేయాలి అని ప్రశ్నించాడు. ఖచ్చితంగా పాతబస్తీలోని రోహింగ్యాలను ఇంకా పాకిస్తాన్ వారిని ఉద్దేశించే ఈ మాటలు అంటున్నారు అని అర్థమైంది. ఇంతకు ముందే సంజయ్ హైదరాబాద్ మేయర్ పదవిని తమ పార్టీ పొందిన తర్వాత పాతబస్తీలోని రోహింగ్యాలను అలాగే పాకిస్తాన్ వారిని తరిమి కొడదామని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలపై టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు బిజెపి పై విరుచుకుపడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద వివాదంగా మారింది. అయితే అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ ఈ ఎన్నికలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గా అభివర్ణించడం చూస్తుంటే ఆయన గెలుపు కోసం ఎలాంటి విమర్శలు అయినా చేసేలా కనిపిస్తున్నారు.