Kota Srinivasa Rao: హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకలో కోట శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోల రెమ్యూనరేషన్, వాణిజ్య ప్రకటనలపై విమర్శలు చేశారు. గతంలో ఏ హీరో తన రెమ్యూనిరేషన్ గురించి ఎక్కడా చెప్పేవారు కాదని.. ఇప్పటి హీరోలు మాత్రం తాను రోజుకి రెండు కోట్లు ఆరు కోట్లు తీసుకుంటున్నట్లు పబ్లిక్ గా చెబుతున్నారని విమర్శల వర్షం కురిపించారు. పబ్లిక్ గా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని విమర్శించారు.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు..? ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు..?, ఎవరికైనా తెలుసా…? ఏనాడైనా వాళ్లు తమ రెమ్యూనరేషన్ గురించి బహిరంగంగా ప్రకటనలు చేశారా..? కానీ ఇప్పటి హీరోలు రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు పబ్లిక్ గా చెబుతున్నారు అని సీరియస్ అయ్యారు. అసలు ఇప్పుడు సినిమా అనేది లేదు అంతా సర్కస్ అంటూ సెటైర్లు వేశారు. విషాద గీతాలకు కూడా డాన్సులు వేసే పరిస్థితి సినిమాల్లో కనిపిస్తుంది అని ఎద్దేవా చేశారు.
ఇంకా హీరోల వాణిజ్య ప్రకటనల గురించి మాట్లాడుతూ…”బాత్రూం క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనలు దాకా అన్ని స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది..? అని కోట ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో “మా” అసోసియేషన్ కీలక సభ్యులు ఆర్టిస్టులు రెండు పూటల భోజనం చేస్తున్నారా లేదా అనేది పట్టించుకోవాలని సూచించారు. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. దయచేసి “మా” అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వాలు ఆలోచనలు చేసి చిన్న ఆర్టిస్టులను బతికించాలని కోట శ్రీనివాసరావు సూచించారు. చిన్న ఆర్టిస్టులకు ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ప్రోత్సాహాలు అందించాలని కోట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో “మా” అసోసియేషన్ కూడా కాస్త ఆలోచించి.. బాధ్యతగా వ్యవహరించాలని… ఆర్టిస్టులను బతికించుకోవాలని విజ్ఞప్తి చేశారు.