Darling: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో డార్లింగ్ ఒకటి. అయితే థియేటర్స్ లో విడుదలై డార్లింగ్ మూవీ నేటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డార్లింగ్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీనే డార్లింగ్. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ప్రభు, తులసి, శ్రద్ధా దాస్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, ముఖేష్ రిషి, శ్రీనివాస రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఏ ఆర్ రెహ్మాన్ మేనల్లుడు జి. వి. ప్రకాష్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ డార్లింగ్ మూవీని నిర్మించారు.
14 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 2010 ఏప్రిల్ 23న థియేటర్స్ లో విడుదలైన డార్లింగ్ మూవీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తొలి ఆట నుంచే హిట్ టాక్ లభించింది. కామెడీ యాంగిల్ లో ప్రభాస్ ను స్క్రీన్ పై చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, కథలో భాగంగా వచ్చే ట్విస్టులు, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కాజల్ అగర్వాల్ గ్లామర్, దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్గా నిలిచాయి. విమర్శకులు సైతం డార్లింగ్ మూవీపై ప్రశంసలు కురిపించారు.
టాక్ అనుకూలంగా ఉండటంతో 2010లో విడుదలై భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా డార్లింగ్ నిలిచింది. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ. 22 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రెండు నంది అవార్డులతో పాటు మరెన్నో పురస్కారాలను అందుకుంది. డార్లింగ్ మూవీ తో ప్రభాస్ ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ చిత్రం ఆయన్ను టాలీవుడ్ టాప్ హీరోల చెంత కూర్చోబెట్టింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డార్లింగ్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదు. ప్రభాస్ కన్నా ముందే డార్లింగ్ కథ టాలీవుడ్ కి చెందిన మరో హీరో వద్దకు వెళ్లంది. కానీ సదరు హీరో నో చెప్పాడు.
ఇంతకీ ఆ అన్ లక్కీ పర్సన్ మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ కరుణాకరన్ డార్లింగ్ మూవీని మొదట అల్లు అర్జున్ తో చేయాలని భావించారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ను కలిసి కథ నెరేట్ చేశారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ చాలా లవ్ స్టోరీలు చేసి ఉన్నాడు. డార్లింగ్ మూవీ కూడా లవ్ స్టోరీ నే. పైగా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కథ నచ్చినప్పటికీ అల్లు అర్జున్ డార్లింగ్ ను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్ వద్దకు వెళ్ళగా.. ఆయన స్టోరీ వినగానే ఎస్ చెప్పి బ్లాక్ పాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.