Family Star: ఈ వారం భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, అభినయ, వాసుకి తదితరులు కీలక పాత్రలను పోషించారు. గోపి సుందర మ్యూజిక్ అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.
ఫ్యామిలీ స్టోరీలు ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి. కుటుంబ బంధాలు ప్రేమానురాగాలు చుట్టూనే స్టొరీ మొత్తం తిరుగుతుంది. స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా కొత్తగా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని ఎన్నో సినిమాలు నిరూపించాయి. కానీ ఈ విషయంలో పరశురామ్ మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడి కథే ఫ్యామిలీ స్టార్. అయితే రొటీన్ స్టోరీని డైరెక్టర్ పరశురామ్ అంతే రొటీన్ గా తెరకెక్కించాడు. దీంతో ప్రేక్షకులే కాదు కనీసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కూడా ఫ్యామిలీ స్టార్ మెప్పించలేకపోయింది.
ప్రపంచవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి టాక్ అంత అనుకూలంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.85 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెండో రోజు కేవలం రూ. 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి నిరాశ పరిచింది. అలాగే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ. 6.30 కోట్ల షేర్ వస్తే.. రెండో రోజు రూ. 4.15 కోట్లను మాత్రమే విజయ్ దేవరకొండ రాబట్టగలిగాడు.
ఇక ఫ్యామిలీ స్టార్ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఫ్యామిలీ స్టార్ చిత్రం రెండు రోజుల్లో రూ. 5.40 కోట్ల షేర్, రూ. 9.00 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 10.30 కోట్ల షేర్, రూ. 19.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. విడుదలకు ముందు ఫ్యామిలీ స్టార్ మూవీకి రూ. 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ టార్గెట్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఫ్యామిలీ స్టార్ మూవీ మొదటి రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 33.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి వీకెండ్, ఫెస్టివల్ హాలిడేస్ అడ్వాంటేజ్‌తో విజయ్ టార్గెట్ ను రీచ్ అవుతాడో లేదో చూడాలి.