Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. గత ఏడాది జున్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం సాయుధ దళాలలో యువకుల రిక్రూట్ మెంట్ కోసం నియమాలను నిర్దేశించింది. ఈ పథకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఈ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. తర్వాత ప్రభుత్వం 2022 లో రిక్రూట్ మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది.

2022వ సంవత్సరం జులై నెలలో ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ లను సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15న ఉదేశాలను రిజర్వు చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం అగ్ని పథ్ రిక్రూట్ మెంట్ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చారని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది.
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య