జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ని వీడి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ లోకి ఎంటర్ అవ్వకముందే ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ .. డెమోక్రటిక్ ఆజాద్ అనే పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన విధేయులుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది అజాద్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. అయితే ఆజాద్ పార్టీలో చేరిన ఆయన విధేయులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

జమ్ము కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రి పీర్జాదా మొహమ్మద్ సయాద్ సహా 17 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. ఆజాద్ ప్రారంభించిన పార్టీ సెక్యులర్ ఓట్లు చీల్చే ప్రమాదం ఉందనీ, దీని వల్ల బీజేపీ బలోపేతం అవుతుందని భావించిన ఈ నేతలు తిరిగి సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నారు. వీరంతా ఢిల్లీలోని ఏసీసీసీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు కేజీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జి రజనీ పాటిల్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆజాద్ తో స్నేహం వల్లనే కాంగ్రెస్ ను వీడి తాము తప్పు చేశామని ఈ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కొద్ది రోజుల్లో జమ్ము కాశ్మీర్ లో ప్రవేశించనున్న రాహుల్ గాంధీ యాత్రలో శ్రీనగర్ లో నేషలిస్ట్ కాంగ్రెస్, పీడీపీ అధినేతలు ఫరూక్ అబ్దులా, మెహబూబా ముఫ్తీలతో కలిసి నడుస్తామని వారు ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆజాద్ పార్టీలో ఓట్ల చీలక వల్ల బీజేపీకి లాభం చేకూరి అధికారంలోకి వస్తామన్న ఆశ పడుతున్న ఆ పార్టీ నేతలకు, ఆజాద్ కు ఈ పరిణామం షాక్ ఇచ్చినట్లు అయ్యింది.