ఏపిలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఒకటి. ఈ ఆలయంలో స్వామి వారి ముందు అబద్దం చెప్పి కొబ్బరి కాయ కొట్టాలంటే సామాన్యుల నుండి రాజకీయ నాయకులకు భయమే. అందుకే రాజకీయ నాయకులు ఎవరైనా ఆరోపణలు చేసిన సమయంలో కాణిపాకం ఆలయంలో కొబ్బరికాయ కొడదాం రా అని సవాల్ విసురుతుంటారు. ఇంతటి ప్రాశస్యం ఉన్న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అధికారులు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఆలయంలో స్వామివారి అభిషేకం టికెట్ ధర రూ. 700/- ను రూ.5,000/- లకు పెంచడానికి ఆలయ అధికారులు అభిప్రాయ సేకరణ పత్రం విడుదల చేశారు.

ఒకే సారి అభిషేకం టికెట్ ధర ను ఏడు రెట్లు పెంచడం వివాదాస్పదం అయ్యింది. భక్తుల నుండి తీవ్ర విమర్శలు ఎదురైయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశంపై ఫైర్ అయ్యారు. అభిషేకం టికెట్ ధరను ఏడు రెట్లు పెంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. ఇలా టికెట్ ధర పెంచే హక్కు ఎవరు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. టికెట్ ధరల పెంచడం వెనక హిందూ మతం పై వైసీపీ ప్రభుత్వం ద్వేషం వెళ్లగక్కుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం స్పందించింది.\

కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారి అభిషేకం టికెట్ ధరను ఏ మాత్రం పెంచలేదని, ఇప్పటి వరకు ఉన్న ధర రూ.700/-లనే యధా విధంగా కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాతల సహాయ సహకారాలతో అత్యంత సుందరంగా పున:నిర్మించిన ఆలయంలో సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామి వారి అభిషేకం భక్తులు అందరికీ అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడమైనది తెలిపింది.
శ్రీ స్వామివారి అభిషేకం టికెట్ ధర రూ. 700/- ను రూ.5,000/- లకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణ పత్రము ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యంగా పరిగణించడం జరిగిందన్నారు. ఈ “అభిప్రాయ సేకరణ పత్రము” పై పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఉపసంహరించుకునేలా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, దేవాదాయ శాఖ కమీషనర్ దృష్టికి కానీ తెలియపరచకుండా టిక్కెట్లు ధర పెంపు విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ కార్యాలయం చెప్పింది.
శ్రీ స్వామివారి అభిషేకం విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే యదావిధిగా కొనసాగడం జరుగుతుందని, ఎలాంటి మార్పులు లేవని భక్తులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి తెలియజేశారు. శ్రీ స్వామి వారి అభిషేకం భక్తులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను జరిపించుకునేలా ఆలయంలో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి వారి కృపాకటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కమిషనర్ కార్యాలయం కోరింది.