శబరిమలలో కరోనా కలకలం.. 27మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ

 

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక పూజలు ఈనెల 16 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపధ్యంలో అనేక జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహించి మరి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈనెల 16 నుండి నేటి వరకు 39 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) శుక్రవారం వెల్లడించింది. వీరిలో 27 మంది ఆలయ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది.

కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారందర్నీ శబరిమల ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. సన్నిధానం, పంబ, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో వీరందరికీ కరోనా సోకిన ట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నేపద్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు తో పాటు శబరిమలకు దారితీసే ప్రతి మార్గంలోనూ కరోనా పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంచారు. వీరు షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం తిరువనంతపురం, తిరువల్ల, చంగనూరు, కొట్టాయం రైల్వే స్టేషన్, బస్టాండ్లలో యాంటిజెన్ పరీక్షల కోసం ఏర్పాటు చేశామని కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో రోజుకు వెయ్యి మంది, వారాంతాల్లో రెండు వేల మంది భక్తులను అనుమతిస్తున్నారు. ప్రతియేటా డిసెంబర్ 26న మండల పూజ నిర్వహిస్తారు. జనవరి 14న మకరవిళక్కు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 20న ఆలయాన్ని మూసేస్తారు. ప్రతి ఏటా లక్షలాది మంది దీక్ష స్వాములు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,తదితర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వస్తుంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల్లో 60 శాతం పైగా తెలుగు రాష్ట్రాల వారు ఉంటారు. ప్రస్తుతం కరోనా నియమం ప్రకారం 10 నుండి 60 ఏళ్ల వయసున్న వారిని మాత్రమే ఆలయంలోనికి అనుమతి ఇస్తున్నామని టీడీబీ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకోవడం ఇదే మొదటిసారి.