Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి.

తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన విరాళాల వివరాలను తీర్థక్షేత్ర నిర్వహకులు వెల్లడించారు. నిన్నటికి 1511 కోట్ల రూపాయలు అందాయని తెలిపారు. రామమందిర నిర్మాణానికి హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకుంటున్నారు.
Ram Mandir : గడువుకు ముందే దాటేసిన టార్గెట్!
దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందని తీర్థక్షేత్ర నిర్వహకులు తెలిపారు. జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. 15 వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేయగా ఇప్పటికే ఆ మార్క్ దాటేసింది.
ఇసుమంతైనా ఇనుము ఉండదు!
భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల సంవత్సరాలు గడిచినా.. చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మిల్లిమీటర్ల వెడల్పు, 3 మిల్లిమీటర్ల లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చని సూచించింది.