బద్ధకం వీడు హైద్రాబాద్ : ఓటింగ్లో కొత్త రికార్డు

 

హైద్రాబాద్ ఓటర్లలో బద్ధకం పోలేదు. వోటింగ్ రోజు బయటకు వచ్చి వోట్ హక్కు వినియోగించుకునేందుకు యువత రావడం లేదు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు అనుకున్న మేర పోలింగ్ జరగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 2016 ఎన్నికల్లో నమోదు అయినా 45 శాతం పోలింగ్ కంటే తక్కువే నమోదు అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.


** జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే అనేక మంది ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
** టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఓటు వేశారు. వీరితోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ సైబారాబాద్ కమీషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్‌లు ఓటు వేశారు.
** జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోనూ 50 శాతం కూడా నమోదు కాలేదు. 2009లో 42.04 శాతంగా నమోదైన ఓటింగ్.. 2016లో 45.29 శాతంగా నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం 50 శాతానికి చేరుకునేలా చేయాలని చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ఓటింగ్ శాతం పెరగడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు 9 శాతం స్వల్ప వోటింగ్ నమోదు అయ్యింది. ఉదయం వేలల్లోనే ఎక్కువగా ఓటర్లు వస్తారు అని అంచనా వేసిన అధికారులకు హైద్రాబాద్ ప్రజల బద్ధకం వాళ్ళ అంచనాలు తలకిందులు అయ్యాయి.
** అయితే అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. నగరవాసులు మాత్రం ఓటు వేయడానికి ఇంకా బయటకు రావడం లేదు. పాతబస్తీలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా ఉంది. మరోవైపు ఐటీ కారిడార్ ప్రాంతాల్లోనూ ఓటు వేసేందుకు ప్రజలు ఇంకా ముందుకురావడం లేదు. పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హఫీజ్‌పేట్‌ మాధవనగర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బంజారాహిల్స్‌ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసనకు చేపట్టారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.