Ram Charan- Shankar : శంకర్ దర్శకత్వం వహించే సినిమాలంటే అందరికీ అవగాహన ఉంటుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించే శంకర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతటి విజయాన్నే సొంతం చేసుకుంటాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా వస్తుందంటే పక్కా సూపర్ హిట్ సినిమా అని అందరూ భావిస్తుంటారు. అదే విధంగా ఎంతో విభిన్న కథా చిత్రాలతో తెరకెక్కించే ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి రోబో సినిమా సమయంలోనే తన మనసులోని మాటను తెలియజేశారు. అయితే ఇప్పటివరకు శంకర్, మెగాస్టార్ కాంబినేషన్లో సినిమా కుదరలేదు. అయితే చిరంజీవికి దక్కని అవకాశం తన వారసుడిగా రామ్ చరణ్ తేజ్ కు దక్కిందని చెప్పవచ్చు.
రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుందని అధికారిక ప్రకటన తెలియజేశారు. శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రామ్ చరణ్ తేజ్ దక్కించుకోగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా 50వ సినిమా కావడం విశేషం. 4 సంవత్సరాల క్రితం దిల్ రాజు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో 25 సినిమాలను నిర్మించగా, ఈ నాలుగు సంవత్సరాలలో 25 సినిమాలను నిర్మించడం విశేషమని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అదే విధంగా దర్శకుడు శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
శంకర్_రామ్ చరణ్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు:
సాధారణంగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే ఎక్కువగా టెక్నికల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలను చేస్తుంటారు. అదేవిధంగా శంకర్ సినిమాలలో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఇలాంటి టెక్నికల్ మెథడ్ ఉపయోగించడానికి భారీ బడ్జెట్ అవసరమయ్యేది. కానీ రామ్ చరణ్ తో తెరకెక్కించే సినిమాలో మాత్రం ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని, సినిమా కూడా తక్కువ బడ్జెట్ తో రెండు, మూడు సంవత్సరాలు కాకుండా కేవలం సంవత్సరంలోపే పూర్తి చేస్తానని దర్శకుడు శంకర్ తెలియజేశారు.