NTR Centenary Celebrations: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కార్యక్రమం కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ కీర్తిని వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్ కారణ జన్ముడని, మహానుభావుడని తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ శక పురుషుడు అనే పుస్తకాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సినీ ప్రముఖులు మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్వినీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, సినీ నటులు రామ్ చరణ్, నాగచైతన్య, శ్రీలీల, సుమంత్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ తదితరులు తొలుత వేదికపై ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ఎన్టీఆర్ జీవిత విషయాలను వివరించారు. ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చే వరకూ పోరాడతామని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే దేశానికే గౌరవమన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28వ తేదీని అమెరికాలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారనీ, తెలుగు జాతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన గుర్తింపు ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలని అన్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రతి ఇంట్లో ఆయనకు నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ నిర్ణయించిందనీ, ఈ విగ్రహ ఏర్పాటునకు అందరూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ శాశ్వత స్థానం పొందారన్నారు. నటనలో అనేక ప్రయోగాలు చేసారని, ఎన్నో సాహసోపేతమైన పాత్రలను అద్బుతంగా పోషించారని తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ స్పూర్తిదాయకంగా ఉన్నాయని వెల్లడించారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా సామాజిక సంస్కరణలకు కృషి చేశారని అన్నారు. మాండలిక వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చిన గొప్ప దర్శనికుడు ఎన్టీఆర్ అని కీర్తించారు.
Amaravati: ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు