ఒక్క నిర్ణ‌యం… ఒకే ఒక్క నిర్ణ‌యం…ఎలా చేసేసింది ప‌వ‌న్‌?

జ‌న‌సేన అధినేత సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించి, అభ్యర్ధులను ప్రచారంలోకి దింపే సమయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

 

హడావుడిగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌, తిరిగి పొత్తు పేరుతో నిర్ణ‌యం ఉప‌సంహ‌ర‌ణ రాజ‌కీయ వ‌ర్గాలు ప‌వ‌న్ పై , ఆయ‌న పార్టీపై విమ‌ర్శ‌లు చేసేందుకు చాన్సిచ్చింది. అదే స‌మ‌యంలో తాజాగా మ‌రో సినీ ప్ర‌ముఖుడు సైతం ప‌వ‌న్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛాన‌ల్‌తో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆయ‌నో ఊస‌ర‌వెల్లి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యాల‌పై ప్ర‌కాష్‌ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు గురించి, పవన్ నిర్ణయాల గురించి ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఊసరవెల్లిలా మారిపోతున్నారంటూ విమ‌ర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ నేతలకు కూడా ఇష్టం లేదని అన్నారు. ‘ఆయనకు ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో నిజంగా చాలా నిరాశకు గురయ్యాను. “ అంటూ ప‌వ‌న్‌పై త‌న అభిప్రాయాల‌ను ప్ర‌కాష్ రాజ్ వెల్ల‌డించారు.

మ‌న‌స్సాక్షి ఉందా ప‌వ‌న్‌?

పవన్‌కు అసలు మనస్సాక్షి అనేది లేదా అంటూ ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించారు. “ప‌వ‌న్‌…నువ్వు ఒక నాయకుడివి. మీకు జనసేన అనే పార్టీ ఒకటి ఉంది. మీరు మరో నాయకుడివైపు చూడటం ఏంటి? మరొకరి భుజం మీద కూర్చోవడంతో కంటే జనసేన పార్టీని నేరుగా బీజేపీలోనే కలిపేస్తే సరిపోతుంది కదా?“ అంటూ ప్ర‌కాష్ రాజ్ ఫైర‌య్యారు.

ఏపీ రాజ‌కీయాల గురించి …

ఏపీ రాజకీయాల గురించి సైతం ప్ర‌కాష్ రాజ్ విశ్లేషించారు. “ ప‌వ‌న్ …. ఆంధ్రాలో జ‌న‌సేన పార్టీకి ఉన్న ఓట్ల శాతం ఎంత‌? బీజేపీ బ‌లం ఎంత‌? ఎందుకు బీజేపీకి మ‌ద్ద‌తిచ్చారు? “ అంటూ ప్ర‌శ్నించారు. మోదీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తుపైనా ప్ర‌కాష్ రాజ్ రియాక్ట‌య్యారు. “2014 ఎన్నికల సమయంలో మీరే స్వయంగా వెళ్లి ఇంద్రుడు, చంద్రుడు అంటూ మోదీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయానికి వారు ద్రోహం చేశారంటూ రివర్స్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు మోదీని నాయకుడిగా కీర్తిస్తున్నారు. ఇలా ప్రతిసారి ఊసరవెల్లిలా మారుతున్నారు. “ అంటూ ప‌వ‌న్ గాలి తీసేసే ప్ర‌య‌త్నం చేశారు.