ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ జీవించే ఉన్నాడనీ, త్వరలోనే ఆయన ప్రజల ముందు వస్తాడంటూ తమిళ జాతీయ వాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటన తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రభాకరన్ కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉన్నారనీ, ఆయన కుటుంబ సభ్యుల సూచనల మేరకే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానంటూ మీడియా సమావేశంలో నెడుమారన్ తెలిపారు. నెడుమారన్ చేసిన ప్రకటన ఇటు భారత దేశంలో, అటు శ్రీలంక వ్యాప్తంగా వైరల్ అయ్యింది. శ్రీలంకలో ఈ వార్త ప్రకంపనలు రేపింది. వాస్తవానికి 2009 లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రభాకరన్ చనిపోయారు. ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన మృతదేహం ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది.

దాదాపు 14 సంవత్సరాల తర్వాత ప్రభాకరన్ జీవించే ఉన్నాడంటూ నెడుమారన్ మీడియా ముఖంగా ప్రకటించడం తీవ్ర సంచలనం అయ్యింది. దీనిపై శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది. నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇదేమైనా జోకా అంటూ శ్రీలంక రక్షణ మంత్రి అన్నారు. శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ .. 2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్లు దృవీకరించామని తెలిపారు. ఆయన డీఎన్ఏ కూడా పరీక్షించామని వెల్లడించారు. ఈ మేరకు నాడు ప్రభాకరన్ హతమైనట్లుగా ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంక అధికారిక ప్రకటన తర్వాత నెడుమారన్ ఎటువంటి ప్రకటన చేస్తారు, ప్రభాకరన్ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడు(ట).. తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన
