నాగార్జున సూపర్ హిట్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయన. తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ స్కసస్ ని సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని నాగార్జున ప్లాన్ చేసి దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి స్క్రిప్ట్ రాయమని చెప్పాడు. నాగార్జున నే ఈ మాట చెప్పడంతో కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేశాడు. కాని అది నాగార్జున కి అంతగా నచ్చకపోవడంతో మళ్ళీ మార్పులు చేర్పులు చేయమని సలహా ఇచ్చాడు.
అయితే ఆ సలహాల సంగతి పక్కన పెడితే సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి దాదాపుగా అయిదు సంవత్సరాలు కావస్తున్న ఈ సినిమా సీక్వెల్ కి మాత్రం ముహూర్తం కుదరడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఇన్నాళ్ళు బంగార్రాజు సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోయిన సంవత్సరం కూడా నాగార్జున, నాగచైతన్య కలిసి బంగార్రాజు నటించబోతున్నట్లుగా ..రమ్యకృష్ణ క్యారెక్టర్ ఈ సీక్వెల్ లోను ఉంటుందన్న వార్తలు వచ్చాయి.
కాని మళ్ళీ కథ మొదటికే వచ్చింది. కథ విషయంలోనే అసలు కథ అడ్డం తిరిగింది. అందుకే ఈ సినిమా కాకుండా నాగార్జున వైల్డ్ డాగ్ చేస్తున్నాడు. దాంతో నాగార్జున వైల్డ్ డాగ్ తర్వాత బంగార్రాజు సినిమాని ట్రాక్ లోకి తీసుకు వస్తాడని అభిమానులు భావించారు. కాని నాగార్జున వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అంతేకాదు త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని అంటున్నారు.
వైల్డ్ డాగ్ .. తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమా..మధ్యలో బాలీవుడ్ లో చేస్తున్న బ్రహ్మాస్త్ర…ఇలా ప్లాన్ చేసుకున్నాడు. ఈలోపు శేఖర్ కమ్ముల తోను నాగార్జున ఒక సినిమా చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున.. బంగార్రాజు సినిమాను వదిలేసినట్లేనని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక నాగార్జున కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణని మరో సినిమా కోసం ట్రై చేసుకోమని చెప్పాడట. ఆ ప్రయత్నాలలోనే కళ్యాణ్ కృష్ణ హీరోలకు కథలు చెప్పాడట. ఇంకా ఏ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది. మొత్తానికి సూపర్ హిట్ కి సీక్వెల్ మాత్రం అటకెక్కినట్టే.