NewsOrbit
న్యూస్

కారంచేడు గావుకేకకు ముప్పై అయిదేళ్లు!

కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు. 1989లో వచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్తిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమ స్ఫూర్తే కారణం.

 

 



అప్పటివరకు దేశంలో ప్రతిచోటా దళితులు అవహేళనకు, హింసకు గురికావడం చాలా మాములు సంగతి. అలాంటి సమయంలో కారంచేడు పెట్టిన గావుకేక దేశమంతా ప్రతిధ్వనించింది. కారంచేడు నెత్తుటి దారిలో తెలుగునేలపై దళిత ఉద్యమం ఉత్తుంగ తరంగంలా లేచి ఒక ప్రభాతగీతమైంది. 1985లో జరిగిన ఆ మారణకాండకు నేటితో 35 ఏళ్ళు గడిచాయి. ప్రతి ఏటా కారంచేడు మారణకాండలో అమరులైన వారిని స్మరించే రుధిర క్షేత్రంలో నెత్తురు మండించే ఈ అమానుషాన్ని తలచుకుని చిన్నా, పెద్దా అందరమూ దుఃఖపడుతూనే ఉంటాం. ఆ మారణకాండ సాగించిన దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ఉద్యమ నాయకులతో కలిసి గ్రామపెద్దలుగా తేళ్ళ ఏసురత్నం, నూనె వెంకటస్వామి, దుడ్డు మాకయ్య, తేళ్ళ నాగయ్య చేసిన కృషి మరువలేనిది. తేళ్ళ నాగయ్య వృద్ధుడైనప్పటికీ ఇంకా నాటి అనుభవాలు చెబుతుంటే ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది.

కారంచేడు గ్రామం ప్రకాశం జిల్లాలోని చీరాలకు 7 కి.మీ.ల దూరంలో ఉంది. 16 వార్డులున్న గ్రామ పంచాయితీ అది. కమ్మ కులస్తులు 8 వార్డులలో నివసించే వారు. మిగతా ఎనిమిది వార్డుల్లో బీసీ, ఎస్‍సీ, ఎస్‍టీ కులాల వారు ఉండే వారు. దళితులు 16వ వార్డులో ఉండేవారు. ఘటన జరిగినప్పుడు 16వ వార్డుకు నా తండ్రిగారు దుడ్డు చిన మార్కు పంచాయితీ సభ్యునిగా వున్నారు. గ్రామంలో ఉన్న రెండు మంచి నీటి చెరువులలో దళితులొకటి, అగ్రకులాలొకటీ వాడుకునే వారు. దళితుల మంచినీటిని కలుషితం చేయబోయిన రాయినీడి ప్రసాద్, పోతిన శ్రీనులను వారించిన కత్తి చంద్రయ్య, అతనిపై దాడికి దిగినవారిని అడ్డుకున్న మున్నంగి సువార్తమ్మ ఆత్మరక్షణ వారి అహాన్ని కవ్వించింది. దీంతో ఊరూ, వాడకు మధ్య వివాదం రేగింది. 1985 జూలై 17న కారంచేడు రక్తసిక్తమైంది. ఆరుగురు హతమయ్యారు. తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ళ యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేశ్, దుడ్డు అబ్రహాంలు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఎందరో స్త్రీలమీద లైంగిక, భౌతిక దాడులు చేశారు. మిగిలినవాళ్లంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చీరాల పట్టణానికి చేరుకున్నారు. వారి తొలి ఆశ్రయం ప్రభుత్వాసుపత్రికాగా, మలి ఆశ్రయం చీరాల లూధరన్ చర్చి అయింది. ఆ ప్రాంతంలోని పదిహేడు దళితవాడల నుండి పూటకొక పేట చొప్పున వారికి ఆహార వసతి సమకూర్చారు. మాదిగలను మధ్యలో పడుకోబెట్టి మాలలు వారికి కాపలా కాశారు. బడుగువర్గాలుగా అందరూ ఐక్యత చూపించారు. చర్చి బాధ్యుల్లో ఒకరయిన ముకిరి విక్టర్ శ్యామ్సన్, పట్టణ కాంగ్రెస్ ప్రముఖుడు సలగల రాజశేఖర్ తొలిదశలో బాధితుల్ని ఆదుకున్నారు. అప్పటివరకు హేతువాద ఉద్యమంలో పనిచేసిన కత్తి పద్మారావు ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ పేదల న్యాయవాదులుగా పేరు గాంచిన బొజ్జా తారకం, వై.కె. అని అందరు ప్రేమగా పిలుచుకునే వై. కోటేశ్వరరావు, వరవరరావు, కొత్తపల్లి రవిబాబు, పీపుల్స్ వార్ నేపథ్యం వున్న ఉషా. ఎస్. డానీ, నాస్తిక సంఘం బొడ్డ్డు రామకృష్ణ, హేతువాద లక్ష్మి (గూడూరు సీతా మహాలక్ష్మి), కలేకూరి ప్రసాద్ (యువక) లాంటి ఎందరో యోధులతో పాటు బొక్కా పరంజ్యోతి లాంటి స్థానికులు కారంచేడు ఉద్యమానికి చోదక శక్తులుగా పనిచేశారు. ఈ ఊచకోత దారుణాన్ని చూసిన ప్రధాన సాక్షి దుడ్డు ఆలీసమ్మ మా నాయనమ్మ. తర్వాత కాలంలో పెత్తందార్ల కుట్రలో భాగంగా విష ప్రయోగం ద్వారా హత్యకు గురైంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే 1985, సెప్టెంబరు 1న కత్తి పద్మారావు దళిత మహాసభను ఆరంభించారు. దేవరపల్లి మస్తాన్ రావు తదితరులు దళిత మహాసభ స్థాపనలో వున్నారు. తరువాతి కాలంలో బలహీనవర్గాల సమాఖ్య ఆవిర్భవించింది. బాధితులకు భూమి, స్థిర నివాసం ఏర్పాటు చేయాలంటూ 28 డిమాండ్లతో కత్తి పద్మారావు, సలగల రాజశేఖర్‌, బొజ్జా తారకం తదితరులు పోరుసల్పారు. నాసా చట్టాలకు ఎదురొడ్డి పోరాడారు. కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు.

ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో ప్రభుత్వం దిగివచ్చింది. కారంచేడు మృతుల కుటుంబాలకు పునరావాస కాలనీ ఏర్పాటు చేసింది. చీరాలలోని డాక్టర్ కొండ్రగుంట సదానందరావు- సావిత్రమ్మ దంపతుల నుంచి 49 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి 436 కుటుంబాలకు ఇళ్ళు కట్టించి ఇచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల స్థలం లభించింది. ఈ ప్యాకేజీ రూపకల్పనలో ఇప్పటి లోక్ సత్తా నేత, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్. జయప్రకాశ్ నారాయణ కీలక పాత్ర పోషించారు. పునరావాస కార్యక్రమాల అమలుకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ అధికారి ఎస్. ఆర్. శంకరన్‌ను ప్రభుత్వం నియమించింది. అనంతరం చీరాల మండల పరిధిలో కారంచేడు బాధితులతో విజయనగర్‌కాలనీ ఏర్పాటైంది. శంకరన్‌ కృషిక1ి గుర్తుగా బాధిత దళితులు కాలనీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. 24ఏళ్ల తరువాత కారంచేడు దోషులకు శిక్షలు పడ్డాయి. తుదిగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడే సమయానికి నిందితుల్లో చాలామంది చనిపోయారు. మిగిలి ఉన్న వారిలో ఒకరికి జీవిత ఖైదు, 29 మందికి మూడేళ్ల శిక్షను కోర్టు విధించింది. జీవితఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తనతో బయటకు రాగా, మిగిలిన 29మంది తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యారు.

కారంచేడు బాధితులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం వ్యవసాయ భూమి కేటాయింపు పూర్తిగా అమలు జరగలేదు. దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కారంచేడు బాధితుల గ్రామం అయిన విజయనగర్ కాలనీ గ్రామ పంచాయితీ అభివృద్ధి పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N